Sunday, December 11, 2011

62వ పడిలో సూపర్‌స్టార్‌

AA

  62వ పడిలో సూపర్‌స్టార్‌

ఆయన ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే. ఆయన స్టైల్స్‌కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అతనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న రజనీ ఇవాళ 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రజనీ స్టైల్స్‌, డైలాగ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసి పెట్టాయి. ఒక్క డైలాగ్‌ చెబితే వందసార్లు చప్పట్లు కొట్టాల్సిందే. అదీ రజనీ స్టైల్‌ తమిళ, తెలుగు, హిందీ... ఇలా భాషలతో సంబంధం లేకుండా అందరిచేత శభాష్‌ అనిపించుకున్న నటుడాయన.

ఇవాళ ఆయన పుట్టినరోజు. 1949 డిసెంబర్‌ 12న కర్నాటకలో మరాఠా దంపతులకు జన్మించారాయన. తల్లి పేరు జిజియాబాయ్‌. తండ్రిపేరు రామోజీరావ్‌ గైక్వాడ్‌. రజనీ అసలుపేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. చలనచిత్ర రంగంలో అడుగుపెట్టకముందు రజనీ ఎన్నో సినిమా కష్టాలు అనుభవించారు. కర్నాటకలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసిన రజనీ ..తన స్నేహితుడు తోటి డ్రైవర్‌ సహాయంతో నటనపై మక్కువతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌ కళ్లలో పడ్డారు రజనీకాంత్‌..మొదటి సినిమా అపురూప రాగంగల్‌తో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటజీవితాన్ని ఆరంభించారు.


ఆ తర్వాత ప్రతినాయక పాత్రల్నీ పోషించారు. అతన్ని హీరోగా నిలబెట్టిన మొదటిచిత్రం ముత్తరామన్‌ దర్శకత్వంలో వచ్చిన భువన ఓరు కల్వికరు. అక్కడి నుండి చిత్రసీమను ఏలుతూ వస్తున్న రజనీ ఇప్పటివరకు 173 చిత్రాల్లో నటించారు. దక్షిణ భారత భాషా చిత్రాలతో సహా బాలీవుడ్‌, హాలీవుడ్‌, జపాన్‌ ,జర్మన్‌ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ముత్తు చిత్రం జపాన్‌ భాషాలో అనువదించబడి రికార్డ్స్‌ సృష్టించింది. ఆరుపదుల వయస్సులోనూ నవ యువకుడిలా తెరపై కనిపించడం ఒక్క రజనీకే సాధ్యమైంది. సినిమాల్లోనే కాదు... నిజజీవితంలోనే రజనీ హీరోనే. పేదలకు ఆయన చేసిన దానధర్మాలు అనేకం.


ఏం చేసినా దేవుడు ఆదేశించాడు, రజనీ ఆచరిస్తాడనే ఆయన సమాధానం. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడిపే ఆయన అడపాదడపా హిమాలయాలకు వెళ్ళొస్తుంటారు. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం. 


tv5news 

0 comments:

Post a Comment